న్యూఢిల్లీ: అవయవ దానం(Organ Transplantation) పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి జాతీయ విధానం, ఏకీకృత నియమావళిని రూపొందించాలని ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. అవయవ దానంకు చెందిన 1994 నాటి చట్టానికి సవరణలు జరిగాయని, 2011 చట్టాన్ని అమలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
కర్నాటక, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాలు కూడా కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అవయవ దానాలకు చెందిన జాతీయ విధానాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. అవయవ దానం చేసిన వారికి న్యాయం దక్కే విధంగా చర్యలు ఉండాలని కోర్టు తెలిపింది. దాతల సంక్షేమం ముఖ్యమని పేర్కొన్నది.