Supreme Court | వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)లతో పాటు రాష్ట్ర కాలుష్య యంత్రణ బోర్డులను ఆదేశించింది. శీతాకాలం ప్రారంభానికి ముందు తమ ప్రణాళికలు అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సారి చలికాలం కాలుష్యం స్థాయి భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం కాలుష్య నియంత్రణ బోర్డుల్లో ఖాళీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రాలను మందలించింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాలు తమ కాలుష్య నియంత్రణ బోర్డుల్లో ఖాళీగా ఉన్న స్థానాలను మూడు నెలల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది.
అదే సమయంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)లు సైతం తమ తమ బోర్డులలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. అయితే, పదోన్నతికి సంబంధించిన స్థానాలను భర్తీ చేయడానికి కోర్టు ఆరు నెలల సమయం ఇచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ. దీని ప్రధాన లక్ష్యం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలతో సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యతను మెరుగుపరచడం. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు సుమోటో పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఈ అంశంపై మళ్లీ అక్టోబర్ 8న విచారించనున్నది. కాలుష్య నియంత్రణ బోర్డుల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలో రాష్ట్రాలు విఫలమయ్యాయని కోర్టు తీవ్రంగా విమర్శించింది. కాలుష్య సమయంలో మానవ వనరుల కొరత పర్యావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని పేర్కొంది.