న్యూఢిల్లీ, మే 2: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి శనివారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 4న జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సూపర్వైజర్లు, సహాయకులుగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను నియమించాలన్న భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు శనివారం నిరాకరించింది. తన సొంత అధికారులను ఎంపిక చేసుకునే హక్కు ఎన్నికల కమిషన్‌కు ఉందని, సర్క్యులర్‌ను కొట్టివేయలేమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ఉద్యోగులు ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నారని స్పష్టం చేసింది.
బెంగాల్ ఎన్నికల ఫలితంపై భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఫలితంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని మమతా దీదీ, మోదీజీ, చివరికి బెంగాల్ అధి దేవత దుర్గామాత కూడా అంచనా వేయలేరు అని వ్యాఖ్యానించారు.