న్యూఢిల్లీ, ఆగస్టు 7: కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని, కోర్టు గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో కోర్టుల్లో ప్రొసీడింగ్స్ సమయంలో, మరీ ముఖ్యంగా వాదనలు లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా వ్యాఖ్యలు చేసే సమయంలో న్యాయమూర్తులు సహనం, బాధ్యతగా ఉండాలని ధర్మాసనం సూచించింది.
ఈ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ హృషికేశ్ రామ్ ఉన్నారు. గత నెల 17న ఇచ్చిన ఆర్డర్ సమయంలో పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్బిర్ షెహ్రావత్ చేసిన చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం తొలగించింది. జూలై 17 నాటి హైకోర్టు ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వీడియోను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విచారణ సమయంలో సింగిల్ బెంచ్ జడ్జి అనవసరమై, అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేశారని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి జరుగకుండా ఉంటాయని ఆశిస్తున్నామని పేర్కొన్నది. జడ్జి వ్యాఖ్యలను సుమోటాగా తీసుకొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. ఆయన తీర్పుపై స్టే విధించిందని తెలిపింది.