న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లకు ప్రాసిక్యూషన్ నుంచి జీవిత కాలం రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. లోక్ ప్రహరి అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్లో, రాష్ట్రపతికి కూడా ఇలాంటి రక్షణ లేదని పేర్కొన్నారు. సీఈసీ, ఇతర ఈసీల నియామకం, సర్వీస్ కండిషన్స్, పదవీ కాలం చట్టం, 2023లోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధమైనదేనా? అని ప్రశ్నించారు. సీఈసీ, ఈసీలు తమ పదవిని దుర్వినియోగం చేస్తే, సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి వీరికి జీవిత కాలం రక్షణ లభిస్తున్నదని తెలిపారు. ఈ సెక్షన్ను రద్దు చేయాలని కోరారు. స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ, ఈ నిబంధనను పరిశీలించేందుకు అంగీకరించింది.