న్యూఢిల్లీ: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్‌ను తమ రాష్ట్రంలో చేపట్టరాదు అని ఆ పిటీషన్లో డీఎంకే కోర్టును కోరింది. దీనిపై అత్యవసరంగా వాదనలు చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అయితే మంగళవారం రోజున ఈ కేసులో వాదనలు చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవల బీహార్‌లో సిర్ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఆ ప్రక్రియ వల్ల బీహార్‌లో 65 ఓటర్లను తొలగించారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో దీన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఈసీ భావిస్తున్నది. ముందుగా కొన్ని రాష్ట్రాల్లో సిర్ ప్రక్రియ చేపట్టనున్నారు.
చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం .. డీఎంకే పిటీషన్‌ను స్వీకరించింది. లాయర్ వివేక్ సింగ్ ఆ పిటీషన్ దాఖలు చేశారు. సిర్ ప్రక్రియకు వ్యతిరేకంగా డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి నవంబర్ 3వ తేదీన పిటీషన్ వేశారు. సిర్ ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రజాస్వామ్య హక్కులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. తమిళనాడులో సిర్ చేపట్టాలని అక్టోబర్ 27వ తేదీన ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ కొట్టివేయాలని లాయర్ వివేక్ తన పిటీషన్లో కోరారు. ఆర్టికల్ 14, 19, 21ని ఉల్లంఘించినట్లు అవుతుందని పిటీషన్లో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ సర్కారు వేసిన పిటీషన్‌పై నవంబర్ 11వ తేదీన వాదనలు చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో వాదించనున్నారు. అవసరమైతే ఈ కేసులో నవంబర్ 12వ తేదీన కూడా వాదనలు నిర్వహించనున్నట్లు కోర్టు చెప్పింది.