Suicide : దొంగతనం చేయకపోయినా తనను దొంగను చేశారని, ఓ కిరాణ దుకాణం యజమాని మాటలు నమ్మి తల్లి కూడా తనను కొట్టిందని ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రం పశ్చిమ మేదినీపూర్ (West Medinipur) జిల్లాలోని గోసాయిబర్ బజార్ (Gosaibar Bazar) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గోసాయిబర్ బజార్‌కు చెందిన కృష్ణేందు దాస్ (12) చిప్స్ కొనుక్కోవడానికి స్థానికంగా ఉన్న ఓ కిరాణా దుకాణానికి వెళ్లాడు. అక్కడ దుకాణంలో దాని యజమాని శుభాంకర్ దీక్షిత్ లేకపోవడంతో వెనుకాల ఇంట్లో ఉన్నాడేమోనని పలుమార్లు అంకుల్.. అంకుల్ అంటూ పిలిచాడు. అయినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాలుడు వెనుదిరిగాడు.
తిరిగి వెళ్తున్న సమయంలో కింద రోడ్డుపై ఒక కుర్కురే పాకెట్ కనిపించడంతో తీసుకున్నాడు. బాలుడు కుర్కురే తింటూ తన ఇంటివైపు వెళ్లడాన్ని గమనించిన దుకాణం యజమాని అతడిని వెంబడించాడు. బాలుడు ఇంటి ముందు అతడిని పట్టుకుని కొట్టాడు. అక్కడ గుమిగూడిన అందరికీ తన దుకాణంలో వీడు చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని చూపించాడు. వాళ్ల ముందే బాలుడితో బలవంతంగా గుంజీలు తీయించాడు.
తాను చిప్స్ ప్యాకెట్ దొంగిలించలేదని, కింద రోడ్డుపై పడి ఉండటంతో తీసుకుని వచ్చానని చెప్పినా దుకాణదారుడు వినిపించుకోలేదు. ఆ బాలుడి తల్లిని రోడ్డుపైకి పిలిచి ‘నీకు కొడుకు నా దుకాణంలో దొంగతనం చేశాడు’ అని చెప్పాడు. దాంతో ఆగ్రహించిన ఆమె కూడా బాలుడిని కొట్టింది. అనంతరం తల్లితోపాటు ఇంట్లోకి వెళ్లిన బాలుడు ఓ గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. ఆ గదిలో ఉన్న పురుగుల మందు సేవించాడు.
అనుమానించిన తల్లి ఎంత పిలిచినా బాలుడు తలుపు తీయకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వాళ్లు తలుపు పగులగొట్టి చూడగా బాలుడు నోట్లోంచి నురుగలు కక్కుతూ స్పృహతప్పి పడిఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.
బాలుడి గదిలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాను దుకాణంలో దొంగతనం చేయలేదని, షాప్ అంకుల్ లేకపోవడంతో తిరిగివస్తుండగా రోడ్డు పక్కన ఒక కుర్కురే ప్యాకెట్ పడి ఉందని, తనకు కుర్కురే అంటే చాలా ఇష్టం కాబట్టి అది తీసుకున్నానని, షాప్ అంకుల్ ఆ కుర్కురేను షాప్‌లో నుంచి దొంగిలించాననుకుని కొట్టాడని వాళ్ల అమ్మను ఉద్దేశించి నోట్ రాశాడు. కాగా పరారీలో ఉన్న షాప్ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.