Sudha Murty | ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ (Infosys) ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా.. చాలా మంది వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలపై నారాయణమూర్తి భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి తాజాగా తొలిసారి స్పందించారు. ఏదైనా పనిని అంకిత భావంతో చేయాలని సంకల్పించినప్పుడు సమయం ఎప్పుడూ పరిమితిగా మారదని వ్యాఖ్యానించారు.
ఓ జాతీయ మీడియాతో సుధామూర్తి మాట్లాడారు. ‘ఏదైనా పనిని అంకితభావంతో చేయాలని సంకల్పించినప్పుడు.. సమయం ఎప్పుడూ పరిమితిగా మారదు. నా భర్త డబ్బులు లేకున్నా ఇన్ఫోసిస్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అంకితభావం కలిగిన వ్యక్తులతో కలిసి 70 గంటలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం పనిచేసేవారు. అలా చేయడం వల్లే అది సాధ్యమైంది. పని గంటలు చూసుకుని ఉంటే.. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఈ స్థాయికి చేరి ఉండేది కాదు’ అంటూ చెప్పుకొచ్చారు. తన భర్త మాత్రమే కాకుండా.. ఈ సమాజంలో కొందరు జర్నలిస్టులు, వైద్యులు, ఇతర రంగాల్లోని వాళ్లు వారానికి 90 గంటలు కూడా పనిచేస్తున్నారని సుధామూర్తి పేర్కొన్నారు.
కాగా, ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే ఉత్పాదకత అతి తక్కువ. ఉత్పత్తిలో మన పని మెరుగు పర్చుకోలేకపోయినా, ప్రభుత్వంలో కొంత స్థాయి వరకూ అవినీతి తగ్గించకపోయినా.. అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలతో మనం పోటీ పడలేం’ అని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ‘నా యువతరానికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే.. ‘ఇది నా దేశం. నా దేశం కోసం నేను వారానికి 70 గంటలు పని చేస్తాను’ అని తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయాలి` అని నారాయణ మూర్తి చెప్పారు.
Also Read..
Twitter Bird Logo | వేలానికి ట్విట్టర్ పాత లోగో.. భారీ ధర పలికిన బ్లూ పిట్ట
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలి : సీఎం స్టాలిన్
Ladakh | చైనా దురాక్రమణను భారత్ ఎన్నటికీ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టీకరణ