Twitter Bird Logo | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్)కు చెందిన ఐకానిక్ లోగో బ్లూకలర్‌లో ఉండే బుల్లి పిట్ట (Blue Bird Logo) గుర్తుందా..? ఒకప్పుడు ట్విట్టర్ పేరు వినగానే అందరికీ ముందుగా ఈ పిట్ట బొమ్మే గుర్తొచ్చేది. నీలిరంగులో ఉండే ఆ పిట్ట బొమ్మ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సదరు పాత ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్‌ను వేలం (auction) వేశారు. ఈ వేలంలో ట్విట్టర్ పిట్ట భారీ ధర పలికింది.
ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన తాజా వేలంపాటలో పిట్ట లోగో 35 వేల డాలర్లకు అమ్ముడైంది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.30 లక్షలన్నమాట. వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి వివరాలను ఆక్షన్ సంస్థ వెల్లడించలేదు. అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్‌క్వార్టర్ బిల్డంగ్ గోడపై ఇంతకాలం దర్శనమిచ్చిన బ్లూ బర్డ్ లోగో పన్నెండు అడుగుల పొడవు, తొమ్మిది అడుగుల వెడల్పు, 254 కిలోల బరువు ఉండేది.
2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మస్క్ అనేక మార్పులు చేపట్టారు. సంస్థ పేరును ట్విటర్ నుంచి ‘ఎక్స్’గా మార్చారు. అదేవిధంగా ట్విట్టర్ పిట్ట స్థానంలోకి ‘X’ను చేర్చారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. కంటెంట్ విషయంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు.. ఒకప్పటి ట్విట్టర్ విలువైన పాత జ్ఞాపకమైన ఐకానిక్ బ్లూబర్డ్ లోగోను అమ్మేశారు.
2006లో ఏర్పాటైన ట్విట్టర్ లోగోగా పక్షుల కిలకిలరావాలకు గుర్తుగా ‘బర్డ్’ లోగో ఏర్పాటు చేశారు. వెబ్ సైట్ క్రియేటివ్ బ్లాగ్ కథనం ప్రకారం లైట్ బ్లూ బర్డ్ సింబల్ కోసం అప్పట్లో 15 డాలర్లు చెల్లించి లోగో తయారు చేయించారు.
Also Read..
MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలి : సీఎం స్టాలిన్
Ladakh | చైనా దురాక్రమణను భారత్ ఎన్నటికీ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టీకరణ
Supriya Sule | విమానాలు సమయానికి రావట్లేదు.. ఎయిర్ ఇండియాపై సుప్రియా సూలే అసహనం