PM Modi | ఢిల్లీ, మే 12: కాల్పుల విరమణ విషయమై మోదీ సర్కారు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ద్వైపాక్షిక అంశమైన కశ్మీర్ విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడం, అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా సోషల్‌మీడియాలో కాల్పుల విరమణను ప్రకటించడంపై దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు మండిపడుతున్నారు. పాలనాపరంగా భారత్ సంక్లిష్ట దేశమని, విద్యావంతుడైన రాజకీయ నాయకుడే ఈ దేశానికి పరిపాలకుడిగా ఉండాలని న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త దేవి సోషల్‌మీడియాలో అభిప్రాయపడగా.. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు మాత్రమే విద్యావంతులని, చంద్రశేఖర్ విద్యావేత్తలను గౌరవించేవారని సుబ్రమణ్య స్వామి తెలిపారు. పరోక్షంగా ప్రధాని మోదీ విద్యావేత్త కాదని ఆయన పేర్కొన్నారని ఆయన రిైప్లెను ఉద్దేశించి పలువురు నెటిజన్లు చర్చించుకున్నారు. ‘భారత్‌కు అత్యంత విద్యావంతుడైన నాయకుడు అవసరం.
అలాంటి నాయకుడే బ్యూరోక్రాట్ల అవసరం లేకుండా స్వయంగా ఇతరులతో చర్చించగలరు. అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలరు. స్వయంగా నిర్ణయం కూడా తీసుకోగలరు. పాలనాపరంగా భారత్ ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన దేశం. చదువు లేకుండానే ఎదిగిన వ్యక్తుల ప్రస్థానాలు బాలీవుడ్ స్క్రిప్ట్‌లుగా మాత్రమే బాగా పనికొస్తాయి’ అని న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త దేవి పేర్కొన్నారు. దీనిపై సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ.. హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా చర్యను చదివిన తర్వాత రాజు (రాష్ట్రపతి) దానిపై సంతకం చేసేవారు. ఆ తర్వాత బ్రాహ్మణులు (ప్రధానమంత్రి) ప్రతిపాదిత చర్యను అమలు చేసేవారు. కాబట్టి, ప్రధానమంత్రి బాగా చదువుకున్నవారై ఉండాలి. భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు మాత్రమే విద్యావేత్తలు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ విద్యావేత్తలను గౌరవించేవారు’ అని పరోక్షంగా మోదీని దెప్పిపొడిచారు.
కాల్పుల విరమణ అవగాహన విషయంలో మోదీ సర్కారు వ్యహరించిన తీరుపై శివసేన (యూబీటీ) విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడం పై ఆగ్రహం వ్యక్తంచేసింది. అసలు ట్రంప్‌కు ఏం హక్కు ఉందని ఆయన మధ్యవర్తిత్వం వహించారని ప్రశ్నించింది. భారత సార్వభౌమాధికారం విషయంలో మోదీ సర్కారు రాజీ పడిందని ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో ఎడిటోరియల్ ప్రచురితమైంది. ‘ట్రంప్ ఒక బిజినెస్‌మ్యాన్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్ లాగా ఆయన అంతర్జాతీయ శాంతిదూత కాదు.
మధ్యవర్తిత్వం వహించే అధికారం ట్రంప్‌కు ఎవరిచ్చారు? ఆయన భారత సార్వభౌమాధికారాన్ని కొనుగోలు చేశారా? అదే జరిగితే ఏం ప్రతిఫలంగా అది జరిగింది? కశ్మీర్ విషయంలో మూడో వర్గం మధ్యవర్తిత్వం ఉండరాదనే సిమ్లా ఒప్పందాన్ని మోదీ సర్కారు ఉల్లంఘించింది. దేశ సరిహద్దులో భద్రత సరిగ్గా లేదు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు దేశంలోకి ఎలా ప్రవేశించారు? మళ్లీ ఎలా తప్పించుకున్నారు? వారి ఆచూకీ ఇప్పటికీ ఎందుకు కనుక్కోలేదు?’ అని ప్రశ్నించింది. బీజేపీ రాజకీయ నాటకాల్లో పడొద్దని, సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికుల విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రజలను శివసేన (యూబీటీ) కోరింది.