న్యూఢిల్లీ: నిద్రవేళపై తాజాగా వెలువడిన ఒక అధ్యయనం గుండె ఆరోగ్యంపై కీలకమైన విషయాన్ని వెల్లడించింది. వారపు రోజుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 60 శాతానికి పైగా ఉన్నట్టు అధ్యయనం పేర్కొన్నది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. నిద్రా సమయం అస్థిరంగా ఉండటం వల్ల మన శరీరంలోని అంతర్గత గడియారం దెబ్బతింటుంది.
ఇది సహజంగా నియంత్రించాల్సిన రక్తపోటు, జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. సిర్కాడియన్ లయ దీర్ఘకాలంగా దెబ్బతినడం వలన అధిక రక్తపోటు ఏర్పడి గుండె, రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల శరీరంలో మంట, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ ఒత్తిడి పెరిగి, గుండె జబ్బులు, స్ట్రోక్ (పక్షవాతం) ప్రమాదాలు అధికమవుతాయి. ఇది కేవలం తక్కువ నిద్ర వల్లనే కాకుండా, పడుకునే సమయం వల్ల కూడా సంభవిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.