న్యూఢిల్లీ, జూన్ 2: సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఎస్ఈ సైబర్ రక్షణ వ్యవస్థ ఏమాత్రం పటిష్టంగా లేని దుర్భలమైన పోర్టల్‌ను నిర్వహిస్తున్న తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నది. ‘సీబీఎస్ఈ మీకు సిగ్గేయడం లేదా.. పరీక్షలను సరిగ్గా ఎలాగూ నిర్వహించ లేక పోయారు.. కనీసం వెబ్‌సైట్‌ను కూడా సక్రమంగా పనిచేసేలా ఉంచలేరా.. ఇంత అసమర్థతా?’ అని పలువురు విద్యార్థులు సామాజిక మాధ్యమం వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఈ పోర్టల్‌ను కొందరు ఎథికల్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. అయితే అదంతా అబద్ధమంటూ తొలుత సీబీఎస్ఈ బుకాయించింది. దీంతో హ్యాకర్లు వారి పోర్టల్‌ను యాక్సెస్ చేసి రుజువులతో సహా చూపడంతో బోర్డు నిజాన్ని ఒప్పుకోక తప్ప లేదు. దీంతో తాత్కాలికంగా దాన్ని నిలిపివేసిన అధికారులు దానిని సరిచేసే బాధ్యత ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ సాంకేతిక నిపుణులకు అప్పగించారు. దీంతో దానిలోని లోపాలన్నీ సవరించామని ప్రకటించి మంగళవారం దాన్ని తిరిగి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు.
విద్యార్థులకు మళ్లీ తప్పని ఇబ్బందులు
వెబ్‌సైట్‌ను ప్రక్షాళన చేసి హ్యాకింగ్ రహితంగా అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు గొప్పగా ప్రకటించినా, విద్యార్థులకు మంగళవారం యథా ప్రకారం కష్టాలు తప్పలేదు. పోర్టల్ తెరవడానికి, దాన్ని యాక్సిస్ చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. రోజంతా పలు ఎర్రర్ మెసేజ్‌లు వారిని తీవ్రంగా విసిగించాయి. మార్కుల పరిశీలన, పునః మూల్యాంకనం కోసం విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సీబీఎస్ఈ పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో తాము విఫలమవుతున్నామని ఫిర్యాదు చేస్తూ పలువురు విద్యార్థులు సామాజిక మాధ్యమంలో పోస్ట్‌లు పెట్టారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ‘వెరిఫికేషన్ ఫెయిల్డ్, ప్లీజ్ చెక్ యువర్ డిటైల్స్ అండ్ ట్రై అగైన్’ అన్న మెసేజ్ వస్తూ విసిగిస్తున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మార్కుల పరిశీలన, జవాబు పత్రాల ఫొటో కాపీలు, పునః మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే సుమారు 4 లక్షలకు పైగా విద్యార్థులు బోర్డు తీరుపై మండిపడుతున్నారు. సాంకేతిక సమస్యలను పూర్తిగా సరిచేయకుండా ఎందుకు పోర్టల్‌ను తెరిచారంటూ వారు బోర్డును ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు అసమర్థతకు రుజువుగా పలువురు విద్యార్థులు పోర్టల్‌లో వచ్చిన మెసేజ్‌లను తనకు పోస్ట్ చేశారని న్యాయవాది వినీత్ జిందాల్ తెలిపారు.
సీబీఎస్ఈ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి
సీబీఎస్ఈ పోర్టల్ తిరిగి మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని, అయితే మొదటి రోజు భారీ సైబర్ దాడులు జరిగాయని, అయినా పునః మూల్యాంకనం, ధ్రువీకరణ యథా ప్రకారం జరుగుతున్నదని అన్నారు. పోర్టల్‌పై డినైల్ ఆఫ్ సర్వీస్ (డీఓఎస్) దాడులు పెద్దయెత్తున జరిగాయని, కేవలం రెండు నిమిషాల వ్యవధిలో 15 లక్షల దాడులు నమోదైనట్టు చెప్పారు. పోర్టల్‌లో ఫైళ్లపై దాడి చేయడానికి లక్షకు పైగా ప్రయత్నాలు జరిగాయన్నారు.
సీబీఎస్ఈ చైర్మన్, విద్యాశాఖ కార్యదర్శికి సమన్లు
సాంకేతిక లోపాలు, మూల్యాంకనంలో వ్యత్యాసాలు, ఫలితాల తర్వాత వెరిఫికేషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విచారణ జరిపేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు విద్యాశాఖ కార్యదర్శి సంజయ కుమార్, సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్‌లను హాజరు కావాలని కమిటీ ఆదేశించింది. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రతినిధులు పాల్గొననున్నారు. జార్ఖండ్‌కు చెందిన 17 ఏండ్ల విద్యార్థి సార్థక్ సిద్ధ్దాంత్ మంగళవారం పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించారు. 12వ తరగతి పరీక్షలకు హాజరైన అతను సీబీఎస్ఈ వెండర్ల ఎంపిక కోసం అనుసరించిన టెండర్ ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు ముందు పలు ప్రశ్నలను ఉంచినట్లు తెలుస్తున్నది. కమిటీకి సార్థక్ తన పరిశోధనలతో కూడిన ఏడు పేజీల నివేదికను సమర్పించారు.
కొత్త చైర్మన్‌గా లోఖండే సీతారామ్
12వ తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చిన క్రమంలో సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తాలను బదిలీ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కొత్త చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారామ్, కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్ నిమమితులయ్యారు. అంతేకాకుండా సీబీఎస్ఈ ద్వారా ఓఎస్ఎం సేవల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏక సభ్య విచారణ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఎస్ రాధా చౌహాన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి సీవోఈఎంపీటీ సంస్థకు ఓఎస్ఎం కాంట్రాక్టు అప్పగించిన విధంపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని సీబీఎస్ఈని కేంద్ర విద్యా శాఖ ఆదేశించింది. కాగా, ఈ కమిటీ నెల రోజుల్లో తన నివేదికను సిబ్బంది, శిక్షణ శాఖకు అందజేస్తుంది. టెండర్ విధానం, కాంట్రాక్టు అప్పగించిన విధానం, దీనిపై నిర్ణయం తీసుకున్న అధికారుల వివరాలు కమిటీ సేకరిస్తుంది.