న్యూఢిల్లీ: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. సర్వర్ క్రాష్ వంటి సమస్యలతో పలు కేంద్రాల్లో పరీక్ష రద్దయిందని విద్యార్థులు ఆరోపించారు. శుక్రవారం పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఢిల్లీలోని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ముందు గుమికూడి పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, జవాబుదారీతనం తేవాలని డిమాండ్ చేశారు. గురువారం ఇదే విషయమై వారు ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా జంతర్ మంతర్ వద్ద నినాదాలు చేశారు.
తెలంగాణలో చిన్నపాటి ఘటన జరిగినా తీవ్ర విమర్శలు చేసే బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎస్ఎస్సీ నిర్వహణ వైఫల్యంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఎస్ఎస్సీ ఫేజ్ 13 ఎగ్జామ్ జూలై 24-ఆగస్ట్టు 1 మధ్య నిర్వహించారు. అయితే పలుచోట్ల సర్వర్ క్రాష్ అయిందని, కంప్యూటర్లు పని చేయలేదని, మారుమూల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారని నిరసనకారులు ఆరోపించారు. పరీక్షలకు సంబంధించి 55 వేల ఫిర్యాదులు వచ్చాయని అధికారులు అంగీకరించారని..వ్యవస్థ పనితీరుకి నిదర్శనమని ఒక టీచర్ వ్యాఖ్యానించారు.
‘బ్లాక్లిస్ట్లోని కంపెనీకి ప్రభుత్వం పరీక్షల నిర్వహణను కేటాయించింది. ఇలాంటి కంపెనీకి మా భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను నిర్వహించమని ఎలా అప్పగిస్తారు’ అని ఓ అభ్యర్థి ప్రశ్నించారు. వ్యయప్రయాసలకు ఓర్చి పరీక్ష కేంద్రాలకు చేరుకున్న తర్వాత పరీక్ష రద్దయిందని చెప్తున్నారని… మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పడం లేదని మరో నిరసనకారుడు తెలిపారు. దీని వల్ల తమ డబ్బు, సమయంతో పాటు కీలకమైన ప్రిపరేషన్ వృథా అయిందన్నారు. ఎగ్జామ్ సెంటర్లలో బౌన్సర్లను ఎందుకు ఉంచాల్సి వస్తున్నదని మరికొందరు ప్రశ్నించారు.