(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలోని శాస్త్రి భవన్ ముందు ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల విద్యార్థులు పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు. ‘పేపర్ లీక్.. మోదీ సర్కార్ వీక్’, ‘డాక్టర్స్ డిగ్రీ ఫర్ సేల్’, ‘పీఎం కాంప్రమైజ్డ్.. పేపర్ కాంప్రమైజ్డ్’ అంటూ నినాదాలు చేశారు. రాజస్థాన్, బెంగాల్లోని పలు నగరాల్లో కూడా పేపర్ లీకేజీ, ఎగ్జామ్ రద్దుపై విద్యార్థులు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు.
పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ స్పందించారు. కోచింగ్ సెంటర్ల దగ్గర కఠిన ఆంక్షలు విధిస్తూ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యాంటీ చీటింగ్ టెక్నాలజీకి సంబంధించి చైనాలో తీసుకొచ్చిన ‘డబుల్ రిడక్షన్’ పాలసీని కోచింగ్ సెంటర్లు, ప్రవేశ పరీక్షల నిర్వహణలో తీసుకురావాలని పేర్కొన్నారు.