హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): సిమ్‌కార్డుల జారీ ఇక మరింత కఠినతరం కానున్నది. సైబర్ నేరాల అడ్డుకట్టలో భాగంగా సీఎస్బీ ఈ నిర్ణయం తీసుకున్నది. టెలికాం ఆధారిత సైబర్ నేరాలను అరికట్టడం, దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సంయుక్తంగా ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాయి.
ఇందులో భాగంగా సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ మాట్లాడుతూ సైబర్ మోసాల్లో విరివిగా ఉపయోగిస్తున్న సిమ్ బాక్స్‌లు, ఇతర అక్రమ టెలికాం సాధనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనుమానాస్పద మొబైల్ నంబర్లను గుర్తించాలని, వినియోగదారులకు సకాలంలో హెచ్చరికలు అందించాలని సూచించారు. నకిలీ, బహుళ సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు సిమ్ జారీ, ధృవీకరణ విధానాలను పటిష్టం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీవోటీ డిప్యూటీ డీజీలు కే రాజశేఖర్, హేమంత్ రాథ్వే, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు.