జెరూసలేం: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు 182 మందితో వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం పెను ప్రమాదం అంచులకు చేరిన వేళ, సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి విమానాన్ని సురక్షితంగా నిలబెట్టిన ఆ ఇద్దరు పైలట్లు ఎవరు? ఫ్లైదుబాయ్ సంస్థ వారిని కేవలం విమానంలో ప్రయాణిస్తున్న ఆన్ డ్యూటీ సిబ్బందిగానే పేర్కొందిగానీ, వారెవరనే వివరాలు ఇంతవరకు వెల్లడించలేదు. అయితే విమానంలో రెండో వరుసలో కూర్చున్న డానియెల్ ష్లిచటర్ అనే ప్రత్యక్ష సాక్షి అసోసియేట్ ప్రెస్(ఏపీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ క్షణంలో జరిగిన ఉత్కంఠ భరిత పరిణామాలను వివరించారు. ‘ఆ విమానంలో ఇద్దరు అదనపు పైలట్లు ఉండటం ఆ రోజు జరిగిన అద్భుతం. కాక్‌పిట్‌లో కో పైలట్ దాడికి దిగాడని, ప్రయాణికులంతా కేకలు వేయడంతో, విమానంలో కలకలం చెలరేగింది.
కెప్టెన్ ఎలాగోలా తలుపును అన్ లాక్ చేశారు. వెంటనే ఒక ప్రయాణికుడు ఆ కో పైలట్‌ను పట్టుకుని బయటకు లాగగా, విమానంలో ప్రయాణిస్తున్న ఒక పైలట్ లోపలికి దూసుకెళ్లి, కాక్‌పిట్ నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. వెంటనే రెండో పైలట్ కూడా లోపలికి వచ్చి, ఎవరూ లోపలికి రాకుండా తలుపులు మూసివేశారు. ఆ పైలట్లు ఎక్కడి నుంచి వచ్చారో తొలుత ఎవరికీ అర్థ్ధం కాలేదు. మొదటి పైలట్ అత్యంత వేగంగా స్పందించారు. పరిస్థితిని అర్థం చేసుకుని, విమానాన్ని అదుపు చేశారు.
విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడినవారికి మేమంతా రుణపడి ఉంటాం. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో విమానాన్ని నియంత్రించేందుకు వారికి 10 నిమిషాల కన్నా అధిక సమయమే పట్టింది. అత్యవసర ల్యాండింగ్ కోసం వారు వెంటనే మేడే కాల్ పంపారు. 45 నిమిషాల తర్వాత సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయబోతున్నామని పైలట్లు ప్రకటించారు’ అని ష్లిచటర్ వివరించారు. ఈ ఘటనలో ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన కో పైలట్ ఒమన్ పౌరుడు హమామ్ అల్-హమ్మామీనే అని గుర్తించారు.