IIM Calcutta | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కోల్‌కతా (Kolkata)లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (IIM Calcutta) చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాయ్స్ హాస్టల్ (boys hostel)కు పిలిపించుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. గత కొంతకాలంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇస్తానని చెప్పి అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థి బాధితురాలిని బాయ్స్ హాస్టల్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె స్పృహలోకి వచ్చాక తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గ్రహించింది. ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా.. అత్యాచారం గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘాయిత్యానికి పాల్పడిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందంటూ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
కాగా, 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీకార్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు.. సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి జీవితఖైదు విధించింది.
ఈ ఘటన మరవకముందే గత నెల చివర్లో ఓ న్యాయ విద్యార్థిని (Law Student)పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. కస్బా (Kasba) పరిసరాల్లో కాలేజ్ క్యాంపస్ (Law College In Kolkata)లోనే విద్యార్థినిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా వరుస ఘటనలతో రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
Ram Mohan Naidu | విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి
Cheetah | తీవ్ర గాయాలతో.. కూనో పార్క్‌లో మరో చీతా మృతి
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. వారే బాధ్యులు : రిపోర్ట్