Strong winds : చైనాను భీకర గాలులు (Powerful winds) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా ఇసుక ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఫలితంగా ఇసుక తుఫాను (Sand storm) బీభత్సం సృష్టిస్తోంది. రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఆ చెట్లు వాహనాలపై పడటంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది.
ముందుజాగ్రత్త చర్యగా బీజింగ్‌లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే దాదాపు 693 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా తన కథనాల్లో వెల్లడించింది. అంతేగాక గాలుల భయానికి బీజింగ్, డాక్సింగ్‌లో వందలాది విమాన, రైలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. తాత్కాలికంగా పార్కులను మూసివేశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. గడిచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బీజింగ్‌లో ఈసారి అత్యంత శక్తివంతమైన గాలులు వీచినట్లు మీడియా కథనాలు తెలిపాయి. ముఖ్యంగా దేశ ఉత్తర తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ గాలులవల్ల జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చైనా ప్రభుత్వం సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అప్రమత్తం చేసింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది.