న్యూఢిల్లీ: గంటలకొద్దీ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్న పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతూ వైద్యుల్ని సంప్రదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నదని, ఆన్లైన్ గేమింగ్, సోషల్‌మీడియాకు పిల్లలు బానిసలుగా మారటమే ఇందుకు కారణమని వారు తేల్చారు. తమ పిల్లలు తీవ్ర ఆందోళన, ఒత్తిడికి లోనవుతున్నారని ప్రతి ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరు చెప్పినట్టు ‘లోకల్ సర్కిల్స్’ సర్వే పేర్కొన్నది. గంటలకొద్దీ సోషల్‌మీడియాతో గడపటం వల్ల పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సర్వే తెలిపింది. ‘ప్రతి 10 మంది పిల్లల్లో ఆరుగురు రోజూ సగటున 3 గంటలకుపైగా గేమింగ్ సైట్స్, సోషల్‌మీడియాతో గడుపుతున్నారని ఓ జాతీయ సర్వే తేల్చింది’ అని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ హర్దీప్ సింగ్ చెప్పారు. అక్టోబర్ 10 ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఈ సర్వే వివరాల్ని విడుదల చేసింది.