కోల్‌కతా, డిసెంబర్ 3 : కన్నవారు రోడ్డుపై వదిలేసిన ఒక నవజాత శిశువును వీధి కుక్కలు రక్షణగా నిలిచి కాపాడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగింది. మయాపూర్ పట్టణానికి 10 కి.మీ దూరంలోని నవద్వీప్లోని స్వరూప్‌నగర్ రైల్వేవర్కర్స్ కాలనీలో ఒక బాత్రూమ్ ఎదుట అప్పుడే పుట్టిన పసికందును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున వదిలేసి వెళ్లారు. దుప్పటిలో చుట్టి ఉన్న ఆ పసికందు చుట్టూ వీధి కుక్కలు ఉదయం వరకు రక్షణగా నిలిచాయి. రాధా భౌమ్విక్ అనే మహిళ టాయిలెట్‌కు వెళ్తుండగా, రోడ్డుపై దుప్పట్లో చుట్టి ఉన్న పసికందు కన్పించింది. దాని చుట్టూ కుక్కలు కాపలాగా నిలుచున్నాయి. తొలుత అవి బిడ్డ దగ్గరకు వెళ్లకుండా ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి.
ఎట్టకేలకు ఈ బిడ్డను తీసుకున్న ఆమె తన మేనల్లుడు భౌమ్విక్ను సహాయం కోసం పిలిచింది. తర్వాత ఆ బిడ్డను దవాఖానకు తీసుకెళ్లారు. బిడ్డ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, అయితే అప్పుడే పుట్టిన బిడ్డకు ఉన్నట్టు తలపై మాత్రం రక్తం ఉందని డాక్టర్లు తెలిపారు. తాము పసికందు ఏడుపును విన్నామని, అయితే అది పక్కింటి నుంచి అనుకున్నామని స్థానికులు తెలిపారు. స్థానికులెవరో బిడ్డను ప్రసవించిన తర్వాత రోడ్డుపై వదిలేసి ఉంటారని నవద్వీప్ పోలీసులు అనుమానిస్తున్నారు. చైల్డ్‌లైన్ అధికారులు కూడా దవాఖానకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.