జమ్ము, డిసెంబర్ 26: కశ్మీరీ పండిట్, డోగ్రా ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. రిజర్వేషన్ క్యాటగిరీలో ఉద్యోగాలు పొందిన డోగ్రా ఉద్యోగులను జమ్ముకు బదిలీ చేయడం కుదరదని, పండిట్ ఉద్యోగులు ఇంట్లో కూర్చుంటే జీతాలు రావని మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. మే నుంచి కశ్మీర్లో ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు తమను కశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరుతూ 9 నెలలుగా కశ్మీరీ పండిట్, డోగ్రా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అనేక సార్లు శాంతియుత నిరసనలు తెలిపారు. బుధవారం వీరి డిమాండ్లను ఉద్దేశించి మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. సోమవారం జమ్ములో కశ్మీరీ పండిట్లు ఆందోళన చేపట్టారు. ‘ఉచకోత కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నదా?’, ‘కశ్మీర్లో మైనారిటీలకు భద్రత లేదు.. పునరావాసం ఒక పెద్ద వైఫల్యం’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
పండిట్లకు అన్ని పార్టీల మద్దతు
కశ్మీరీ పండిట్, డోగ్రా ఉద్యోగుల ఆందోళనకు జమ్ముకశ్మీర్‌లోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మనోజ్ సిన్హా వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆప్ నేతలు ఖండించారు. భద్రత కల్పించలేనప్పుడు కశ్మీరీ పండిట్ ఉద్యోగులను బలిపశువులను చేయొద్దని మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.