బెంగళూరు: కర్ణాటకలోని మాండ్యా జిల్లా మద్దూర్ టౌన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గణేశ్ శోభాయాత్రపై (Ganesh Visarjan) దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్నవారు మసీదుపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
ఆదివారం రాత్రి మద్దూర్ టౌన్‌లోని సిద్ధార్థ నగర్లో పటిష్ట బందోబస్తు నడుమ వినాయక విగ్రహం ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామ్‌రహీమ్ నగర్‌లోని మసీద్ వద్దకు యాత్ర చేరుకోగానే.. గుర్తు తెలియని వ్యక్తులు శోభాయాత్రపై రాళ్లు రువ్వారు. ప్రతిగా శోభాయాత్రలో పాల్గొన్నవారు కూడా మసీదుపై రాళ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలోని హిందూ ముస్లింలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలు శాంతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశామని మాండ్యా ఎస్పీ వెల్లడించారు.