Omar Abdullah : కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) పై జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్రహోదా (Statehood) ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో బీజేపీ అధికారం కోల్పోయిందని, అందుకే రాష్ట్రహోదా ఇవ్వలేదని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించడంలో జాప్యం చేయడమంటే అది అక్కడి ప్రజలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు.
బుధవారం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘జమ్ముకశ్మీర్ ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలువకపోవడం వాళ్ల దురదృష్టం. ఏదేమైనా అందుకోసం ఇక్కడి ప్రజలు శిక్ష అనుభవించొద్దు. చూడబోతే ఎన్నికల్లో బీజేపీ గెలువలేకపోయినందుకే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇవ్వడం లేదేమో అనిపిస్తున్నది. ఇది ప్రజలపాలిట అన్యాయం. ఫలితాలు బీజేపీ అనుకూలంగా ఉంటేనే రాష్ట్రహోదా ఇస్తామనుకోవడం కరెక్ట్ కాదు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై వ్యతిరేకత బీజేపీ నుంచే వస్తోంది’ అన్నారు.
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించే విషయంలో తాము డీలిమిటేషన్, ఎలక్షన్స్, స్టేట్హుడ్ అనే ‘త్రీ స్టెప్ ఫార్ములా’ను అమలుచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిందని, ఇప్పుడు త్రీ స్టెప్స్ పూర్తయినా రాష్ట్రహోదాను మాత్రం కల్పించలేదని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ అనేది అతిపెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు.