Starlink | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్నది. ఈ మేరకు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. కొద్దిరోజుల్లోనే సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సంకేతాలను పంపారు. సోషల్ మీడియా వేదికగా కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సిందియా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘స్టార్‌లింక్’తో భారత్‌కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని స్పందించారు. కేంద్ర ప్రభుత్వంతో స్టార్‌లింక్ బృందం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నది.
స్టార్‌లింక్‌కు చివరి దశ అనుమతి రావాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ ఇటీవల ఢిల్లీలో భేటీ అయ్యారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ ఆధారిత కనెక్టివిటీని విస్తరించడం ప్రయత్నంలో భాగంగా చర్చలు జరిపినట్లుగా సింధియా చెప్పారు. సంప్రదాయ నెట్వర్క్ అందుబాటులో లేని చోట్ల శాటిలైట్ ఇంటర్నెట్ కీలకం కానుందన్నారు. దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని లారెన్ డ్రేయర్ తెలిపారు. అయితే, గ్రామీణ ప్రాంతాలకే స్టార్‌లింక్ సేవలు పరిమితమవుతాయని మస్క్ స్పష్టం చేశారు. కనెక్టివి లేని, ఖరీదైన, నమ్మకం లేని బ్రాడ్‌బ్యాండ్ ఉన్న ప్రాంతాల్లోని వారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు పేర్కొన్నారు.
పరిమితుల కారణంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు వెబ్సైట్లో వైరల్ అయ్యాయి. రెసిడెన్షియల్ యూజర్స్‌కు నెలకు రూ.8600, హార్డ్‌వేర్ కిట్‌కు అదనంగా రూ.34 వేలు చెల్లించాల్సి ఉంటుందని.. ఈ ప్యాకేజీలో శాటిలైట్ డిష్, వైఫై రౌటర్, మౌంటింగ్ స్టాండ్, పవర్ అడాప్టర్, కేబుల్స్‌తో కూడిన ప్లగ్ అండ్ ప్లే కిట్‌ను కస్టమర్లకు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఈ ధరలపై స్టార్‌లింక్ స్పందించింది. సాంకేతిక లోపం వల్లే అలా జరిగిందని.. ఆ ధరలు వాస్తవమైనవి కావని కంపెనీ స్పష్టం చేసింది. స్టార్‌లింక్ ఇండియా వెబ్సైట్ ఇంకా అధికారికంగా లాంచ్ చేయలేదని.. కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.