బెంగళూరు, మార్చి 7: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పేరు ఎత్తితే చెప్పులతో కొట్టాలని శ్రీరాంసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ప్రజలకు పిలుపునిచ్చారు. పనికిరాని బీజేపీ నేతలకు మోదీ పేరుతో ఓట్లడగడం తప్ప ప్రజలు, కార్యకర్తల సమస్యలు అర్థం కావని విమర్శించారు.
మోదీ పేరు, ఫొటో లేకుండా చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు, హిందుత్వానికి, గోరక్షణకు చేసిన పనుల గురించి చెప్పి ఓట్లు అడిగే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇటీవల బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న ప్రమోద్ ముతాలిక్ రానున్న ఎన్నికల్లో కర్ణాటకలోని కర్కల అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.