Assam | గౌహతి, జూన్ 7: బీజేపీ గొప్పగా చెప్పుకొనే డబుల్ ఇంజిన్ సర్కార్ డొల్లతనం మరోసారి బయటపడింది. డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ర్టాల్లో ట్రబుల్స్ తప్పవని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర బీజేపీ పాలిత రాష్ర్టాలు సమస్యల నిలయంగా మారాయి. తాజాగా మరో బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తింది. ఆ రాష్ట్రంలో విద్యుత్తు సమస్య తీవ్రస్థాయికి చేరుకున్నది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని స్థితికి ప్రభుత్వ ఆర్థిక స్థితి దిగజారింది. తన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకొన్నది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఫ్యాన్లు వాడొద్దని ప్రజలకు ఉచిత సలహా ఇవ్వడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. ఎలక్ట్రానిక్ పరికరాలను అసలు వాడనే వాడొద్దని స్పీకర్ విశ్వజిత్ దైమరీ ప్రజలకు సూచించడం చూస్తుంటే ఆ రాష్ట్రంలో విద్యుత్తు సమస్య ఏ స్థాయిలో ఉన్నదో చెప్పవచ్చు. అదే సమయంలో తొమ్మిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించింది. రాష్ట్రంలో 24 గంటలు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తూ దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రశంసలు అందుకుంటున్నది.
ప్రజలపైనే భారం వేస్తాం…
ఇటీవల ఆస్తి, మునిసిపల్, తదితర పన్నులను పెంచుతూ అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు విద్యుత్తు టారిఫ్లను భారీగా పెంచారు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. విద్యుత్తు బిల్లులు చెల్లించలేని స్థితికి ప్రజలు చేరుకున్నారు. దీంతో రాష్ట్ర స్పీకర్ విశ్వజిత్ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. ‘విద్యుత్తు రేట్లు భారీగా పెరిగాయి. ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసేంత స్థోమత రాష్ర్టానికి లేదు. ఖజానాలో పైసల్లేవు. రాష్ర్టానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కూడా లేవు. ఒకవేళ ఎక్కువ ధరకు ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేస్తే.. ప్రజలపైనే భారం వేయాల్సి వస్తుంది. తిరిగి మీ నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. ఫ్యాన్లు వాడొద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలు అసలే వినియోగించవద్దు. చెట్ల కింద సేదతీరండి. తద్వారా విద్యుత్తు బిల్లులు తక్కువ వస్తాయి. విద్యుత్తు విషయంలో రాష్ట్రం స్వీయ స్థిరత్వం పొందేలా విద్యుత్తును వాడాలి’ అని ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చారు.
రాష్ట్ర గౌరవాన్ని కించపరిచిన స్పీకర్…
స్పీకర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే కామక్లఖ్య పుర్కయస్త ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్పీకర్ విశ్వజిత్ ఇంటి ముందున్న చెట్టు కింద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ, మర్యాదలను స్పీకర్ కించపరిచారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. స్పీకర్ వ్యాఖ్యలు దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించాయి. దీన్ని ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా తెలిపాయి.