Southwest Monsoon : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. జూన్ 4న కేరళను తాకిన రుతుపవనాలు, అక్కడి నుంచి అత్యంత వేగంగా ముందుకు కదిలి ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టాయి. రాబోయే కొన్ని రోజుల్లో ఇవి దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు రాయలసీమ ప్రాంతమంతటా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండుమూడు రోజులుగా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రుతుపవనాల రాకతో రాబోయే వారంలో ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా జనాలను హడలెత్తించిన భానుడి భగభగలు తగ్గి, ఉష్ణోగ్రతలు ఈ వర్షాలతో అదుపులోకి రానున్నాయి. మరోవైపు రుతుపవనాల ప్రవేశంతో రైతన్నల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడితే, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సాగు పనులు, ముఖ్యంగా వరి నారుమళ్లు, నాట్లు వేసే ప్రక్రియ ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.