skeleton found | కర్ణాటక హసన్ (Hassan) జిల్లాలో ఓ కేసు మిస్టరీ వీడింది. రెండేండ్ల క్రితం అదృష్యమైన 32 ఏండ్ల యువకుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తండ్రే కుమారుడిని హతమార్చి ఇంటి పెరట్లో పాతిపెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనాస్థలి వద్ద తవ్వకాలు జరిపి యువకుడి అస్థిపంజరాన్ని (skeleton found) వెలికితీశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ జిల్లా సాంతెబసవనహళ్లి (Santebasavanahalli) గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తి ఆర్థిక వివాదాల కారణంగా తన కుమారుడు రఘు (32)ని 2022లో పదునైన వస్తువుతో కొట్టి హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. అప్పటి నుంచి రఘు ఎవరికీ కనిపించలేదు. ఈ ఏడాది ఆగస్టు 1న తండ్రి గంగాధర్ మరణించాడు. అయితే, తండ్రి అంత్యక్రియలకు కొడుకు హాజరుకాకపోవడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన కర్మకాండలకు కూడా రఘు రాలేదు. దీంతో బంధువులు రఘు తమ్ముడు రూపేష్‌ను గట్టిగా ప్రశ్నించారు. దీంతో రూపేష్ అసలు విషయం బయటపెట్టాడు. తన తండ్రే అన్నను చంపి పెరట్లో పాతిపెట్టినట్లు చెప్పాడు.
దీంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూపేష్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో ఇంటి పెరట్లో రఘు అస్థిపంజరాన్ని వెలికితీశారు. అనంతరం దాన్ని పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో రఘు మాజీ బీఎమ్‌టీసీ ఉద్యోగి అని తేలింది. క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాటలో భారీగా డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది.
ఉద్యోగం కోల్పోయిన తర్వాత స్వగ్రామానికి తిరిగొచ్చిన రఘు.. అప్పులు తీర్చేందుకు తండ్రిని డబ్బుల కోసం వేధించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంలో తండ్రీకొడుకుల (financial disputes) మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, అది తారాస్థాయికి చేరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో గంగాధర్ పదునైన ఆయుధంతో రఘుపై దాడి చేయడంతో అతడు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని పెరట్లో పాతిపెట్టినట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఈ కేసులో తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. గంగాధర్ బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..
KBC | బిగ్‌బీ షోకి ఆపరేషన్ సిందూర్ మహిళా ఆఫీసర్లు.. నెటిజన్ల విమర్శలు
Chief Justice | వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలు.. పునఃపరిశీలిస్తామన్న సీజేఐ
PM Modi | టారిఫ్‌ల టెన్షన్ వేళ.. వచ్చేనెల ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ..!