Sonia Gandhi: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఈ సారి పెద్దల సభకు వెళ్లనున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ బరిలో దిగనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆమె రేపు నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారని తెలిపాయి. అయితే దీనిపై పార్టీ ఈ రాత్రికి తుది నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నాయి.
దాంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయ్యింది. ఈ సారి పెద్దలకు సభకు వెళ్తుంది కనుక ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడే ఛాన్స్ లేదు. ఇదిలావుంటే సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి ఆమె కుమార్తె, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ బరిలో దిగనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సోనియాగాంధీ నామినేషన్ సమయంలో ఆమె వెంట పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్‌గాంధీ కూడా ఉంటారని కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి