పనాజీ, ఆగస్టు 24: బీజేపీ నాయకురాలు, టిక్కాట్ స్టార్ సోనాలి ఫోగాట్(42) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇద్దరు సహోద్యోగులే ఆమెను హత్యచేసి ఉంటారని సోదరుడు రింకు ధాకా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె గుండెపోటుతో మరణించినట్టు మంగళవారం వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సోనాలి మరణానికి ముందు కూడా ఆమె తమ తల్లి, సోదరి, బావతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మందులు కూడా వాడటం లేదని అన్నారు.
సోనాలి.. ఇద్దరు కొలిగ్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారని, ఆ ఇద్దరే తన సోదరిని చంపేసి ఉండవచ్చని ఆరోపించారు. వారిపై ఫిర్యాదుచేస్తే పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారని తెలిపారు. సోనాలి మరణానంతరం హర్యానాలో ఆమె ఫామ్‌హౌస్‌లో నుంచి ఉన్నట్టుండి సీసీటీవీ కెమెరాలు, ల్యాప్‌టాప్, ఇతర కీలక వస్తువులు కనిపించకుండా పోయారని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. సోమవారం తన కొలిగ్స్‌తో కలిసి సోనాలి ఫోగాట్ గోవాకు వెళ్లారు. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సిబ్బంది ఉత్తర గోవాలో అంజునాలోని సెయింట్ అంథోని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోనాలి మరణంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. వైద్యుల అభిప్రాయం మేరకు అనుమానాస్పద హార్డ్ఎటాక్గా కేసుగా నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టులో అన్ని విషయాలు వెల్లడవుతాయని గోవా డీజీపీ జెస్పాల్సింగ్ పేర్కొన్నారు.