ప్రస్తుత తరం యువకులు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు. కొందరు తాము చెయ్యాలనుకునే దుర్మార్గపు పనుల వివరాల కోసం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తాజాగా అంకిత్ (32) అనే యువకుడు తన తండ్రిని హత్య చేయించేందుకు ఫేస్బుక్లో వెతికి ఒక కిల్లర్‌ను హైర్ చేసుకున్న ఘటన కలకలం రేపింది.
మధ్యప్రదేశ్‌లోని శివపురి సమీపంలోని పిచ్చోరే టౌన్లో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివశించే మహేష్ గుప్తాకు ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ.. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. రెండో బిడ్డ అయిన అంకిత్ చెడు వ్యసనాలకు బానిస. మందు, గ్యాంబ్లింగ్ కోసం విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టేవాడు.
తన వద్ద డబ్బు అయిపోగానే తండ్రిని అడిగేవాడు. కొడుకు ఇలా మారడంతో విసుగెత్తిన మహేష్.. డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇటీవల తన అన్న చనిపోవడంతో రూ.కోటి వరకు ఇన్సూరెన్స్ డబ్బులు తండ్రికి వచ్చినట్లు అంకిత్‌కు తెలిసింది. అది కాక పెన్షన్ వస్తూనే ఉంది. ఈ డబ్బులన్నీ తనే కాజేయాలని ప్లాన్ వేశాడు.
దానికోసం ఫేస్బుక్లో వెతికి బిహార్‌కు చెందిన అజిత్ సింగ్ అనే కిల్లర్‌ను సంప్రదించాడు. తన తండ్రిని హత్య చేస్తే రూ. లక్ష ఇస్తానని చెప్పాడు. దీనికోసం తన మిత్రుడు నితిన్ లోధితో కలిసి పథకం రచించాడు. వీల్లిద్దరూ కలిసి అజిత్‌కు ముందుగా అడ్వాన్స్ కింద రూ.పది వేలు ఇచ్చారు. అతను తమ ఊరికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు.
తన పని ఏంటో చెప్పకపోవడంతో విసుగెత్తిన అజిత్.. ముందుగానే డబ్బు ఇవ్వాలని, లేదంటే మర్డర్ ప్లాన్ అయినా చెప్పాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో తన పథకం చెప్పిన అంకిత్.. ఇంటికెళ్లి తన భార్యాపిల్లలను వేరే గదిలో పడుకోవాలని చెప్పాడు. అర్ధరాత్రి తనే స్వయంగా తలుపులు తెరిచి అజిత్‌ను లోపలకు పిలిచాడు.
నాటు తుపాకీ చప్పుడు విని లేచి బయటకు వచ్చిన భార్యతో.. ఎక్కడో పిడుగు పడిన చప్పుడని చెప్పి వెనక్కు పంపేశాడు. తెల్లారగానే లేచి చుట్టుపక్కల అందరి ముందు తన తండ్రిని ఎవరో చంపేశారని ప్రచారం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానంతో అంకిత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నోరు విప్పడంతో నితిన్, అజిత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.