కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 22 : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు సంబంధించిన అత్యంత కీలకమైన శిక్షణ శిబిరాన్ని గుర్తించిన జవాన్లు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు బీజాపూర్ జిల్లా పరిధిలోని బట్టిగూడ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిక్షణ శిబిరాన్ని జవాన్లు గుర్తించారు. మావోయిస్టులు వేలాది మందిని రిక్రూట్ చేసుకుని ఇక్కడే శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
అదే ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ స్మారక స్థూపాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా జరుగుతున్న ఆపరేషన్ ‘కగార్’తో మావోయిస్టు పార్టీకి చిక్కులు వచ్చి పడుతున్నాయి. వేలాదిగా భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టి పార్టీ అగ్రనేతలను హతమారుస్తున్నాయి. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధి ముత్వెండి-పీడియా వెళ్లే మార్గంలో జవాన్లను లక్ష్యంగా చేస్తూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరను భద్రతా దళాలు మంగళవారం సాయంత్రం గుర్తించి నిర్వీర్యం చేశాయి.