BRS | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మరాఠ్వాడా గడ్డపై బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. సరికొత్త చరిత్రను లిఖించబోతున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదానికి రైతులే కాదు.. ఐటీ ఉద్యోగులు సైతం ఫిదా అవుతున్నారు. తెలంగాణ మాడల్‌కు ముగ్ధుడై.. లక్షల్లో వచ్చే వార్షిక వేతనాన్ని వదిలి, ఎంతోమంది కలలుగనే ఐటీ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి ఓ యువకుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ యువకుడి పేరు శరద్ మర్కడ్. ఇటీవలే మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్ నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీలో పనిచేయాలన్న నిర్ణయాన్ని శరద్ వెల్లడించాడు. అనుకున్నదే తడవు ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు.
తెలంగాణ మాడల్ అభివృద్ధిని తాను స్వయంగా చూశానని, ముఖ్యంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో అమలైతే మరాఠా రైతులకు విముక్తి లభిస్తుందనే విశ్వాసాన్ని శరద్ వ్య క్తం చేశాడు. బీఆర్ఎస్లో చేరి మహారాష్ట్ర రైతుల కోసం పనిచేయటానికి కంకణం కట్టుకున్నాడు. ఏడాదికి రూ.4.8 లక్షల ప్యాకేజీతో ఐటీ ఉద్యోగమంటే యువత ఎగిరిగంతేస్తుంది. కానీ శరద్ మర్కడ్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. స్వయంగా వ్యవసా య కుటుంబం నుంచి వచ్చిన వాడు కావటంతో రైతుల కష్టాలు అతనికి బాగా తెలు సు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రత్యక్షంగా చూశాడు. అంతే ఆ యువకుడి మది నిండా కేసీఆరే నిండిపోయారు. బీఆర్ఎస్ ఎజెండా అతని ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉన్నపళంగా ఉద్యోగాన్ని వదిలి మహారాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ తరుఫున పనిచేయటానికి నిర్ణయించుకున్నాడు.
శరద్మార్కడ్ నేపథ్యమిది
శరద్ మర్కడ్ స్వస్థలం అహ్మద్‌నగర్ జిల్లాలోని నివ్దుండే. రైతు కుటుంబంలో పుట్టిన శరద్ కుటుంబానికి ఒకటిన్నర ఎకర పొలమే జీవనాధారం. తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. రైతుల దుస్థితిపైనే అతని ఆలోచనలు కొనసాగేవి. విద్యార్థి దశలోనే రైతుల కోసం ఉద్యమం చేయాలని భావించాడు. తన జీవితాన్ని రైతు శ్రేయస్సుకే అంకితం చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. శరద్ చదువుల్లోనూ చురుకైన వాడు. 12వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆర్థిక స్థోమత లేక టెక్స్టైల్ షాపులో పనిచేస్తూ డిగ్రీ కంప్యూటర్స్ చేసి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. 2019లో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. పంటలు చేతికి రాలేదు. పశువులకు తాగేందుకు నీరు, గ్రాసానికి కొరత ఏర్పడింది.
ఈ పరిస్థితిలో శరద్ మొట్టమొదటిసారిగా సొంతంగా పశుగ్రాస శిబిరాన్ని ప్రారంభించాడు. దీనిద్వారా కరువు తీరే వరకు వంద పశువులకు ఉచితంగా గ్రాసాన్ని అందచేశాడు. శరద్‌కు 19 ఏండ్ల వయస్సున్నప్పుడు ఢిల్లీలో రైతుల ఆందోళనలు జరిగాయి. ఇవి తనను త్రీవంగా ప్రభావితం చేశాయి. 2022లో దేశంలో లంపీ వ్యాధి ప్రబలింది. దేశంలోనే మొదటి లంపీ క్వారంటైన్ కేంద్రాన్ని శరద్ ప్రారంభించాడు. రైతులను, పశువులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించాడు. సైకిల్‌పై తిరుగుతూ సామాజిక సేవలందిస్తున్న అతడి శ్రమను గుర్తించిన రైతులు చందాలు వేసుకుని మరీ రూ. 30 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. రైతుల అభిమానాన్ని శరద్ ఎంతలా చూరగొన్నాడో ఈ సంఘటన నిరూపిస్తున్నది.