ముంబై, జూన్ 7: సోషల్‌మీడియాలో వెలువడుతున్న పోస్టులు మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య మతచిచ్చును రేపుతున్నాయి. మొన్న అహ్మద్‌నగర్..నేడు కొల్హాపూర్‌లో రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ పాలనను కీర్తిస్తూ సోషల్‌మీడియాలో తాజాగా వెలువడిన పోస్టులు మహారాష్ట్రలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఈ పోస్టులకు వ్యతిరేకంగా హిందూత్వ గ్రూపులు బుధవారం కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈనేపథ్యంలో కొల్హాపూర్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఛత్రపతి శివాజీ చౌక్ వద్దకు చేరుకున్న ఆందోళనకారులు అక్కడి దుకాణాలపై దాడికి దిగారు. వాహనాల్ని ధ్వంసం చేశారు. నగరంలోని మరికొన్ని చోట్ల రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్లదాడికి దిగారు.
దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. నగరంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు. చిన్న చిన్న అంశాల్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో మత చిచ్చు రేపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోనే కొన్ని శక్తులు చెలరేగిపోతున్నాయని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత పరిస్థితులు నెలకొల్పటంలో షిండే, బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్‌వర్గం), కాంగ్రె స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ఈ అల్లకల్లోలం ఎవరు రేపారు? అని ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఔరంగజేబ్‌ను గొప్ప పాలకుడుగా కీర్తించటాన్ని ఎంతమాత్రమూ సహించమని రాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.