న్యూఢిల్లీ, మే 25: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 2024 పేపర్ లీక్ కేసుకు సంబంధించి పలు మార్గదర్శకాలు అందినప్పటికీ ఎన్టీఏ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైద్య పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ స్థానంలో పటిష్టమైన, స్వయంప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.
ఈ విషయమై కేంద్రం, ఎన్టీఏ, సీబీఐల నుంచి కూడా సుప్రీంకోర్టు స్పందన కోరింది. 2024 నీట్ పేపర్ లీక్ విషయంలో కోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీ సూచించిన ఆదేశాల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఎన్టీఏను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షను మే 12న ఎన్టీఏ రద్దు చేసింది.