Smriti Irani | అమేథీ నుంచి ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తనపై పోటీ చేసి, గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిశోర్లాల్ శర్మను అభినందిస్తూ `ఎక్స్ (మాజీ ట్విట్టర్)`లో పోస్ట్ చేశారు. `గ్రామం ఒక దశాబ్దంలో నా జీవిత ప్రయాణం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సాగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ, జీవితాలను నిలబెడుతూ ప్రయాణం సాగింది. మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేశాం. రోడ్ల నిర్మాణం, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేశాం. కాలువలు తవ్వించాం. పలు అభివృద్ధి పనులు చేపట్టాం. గెలుపొటముల్లో తన పక్షాన నిలిచిన వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా. సంబరాలు జరుపుకుంటున్న వారిని అభినందించారు. సంబరాలు అంబరాన్ని తాకుతాయి` అని వ్యాఖ్యానించారు.
ఐదేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మట్టి కరిపించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఐదేండ్లు తిరిగే సరికి దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు కిశోర్ లాల్ శర్మ చేతిలో 2024 ఎన్నికల్లో స్మృతి ఇరానీ 1.66 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.