న్యూఢిల్లీ: పండుగపూట డిస్కౌంట్ సేల్ ముగిసింది. ఇక ఇప్పుడు ధరల పెరుగుదల మొదలైంది. స్మార్ట్ఫోన్ల(Smartphones) ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లపై 2వేలు పెంచేశారు. స్టోరేజ్ కంపోనెంట్ల ధరలు పెరగడంతో మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. దీని ప్రభావం కొత్త ఫోన్లపై పడనున్నది. ఈ ఏడాది చివరలో.. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజయ్యే కొత్త ఫోన్ల ధరలు ఇక చుక్కలను అంటుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్త ఫోన్ల మోడళ్లపై 5వేల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నవంబర్ నాలుగో తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు గతంలో వెల్లడించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల కూడా ఫోన్ ధరలపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.
కాంపోనెంట్ ధరలు పెరిగిన విషయంలో ఆ భారాన్ని ఇప్పటికే కస్టమర్లపై రుద్దుతున్నారు. వీవో టీ సీరిస్, టీ4 లైట్ 5జీ సీరీస్, టీ4ఎక్స్ 5జీ సీరీస్‌పై 1500 పెంచేశారు. ఒప్పోకు చెందిన రెనో 14 సిరీస్, ఎఫ్ 31 సిరీస్‌పై కూడా ధరలను వెయ్యి నుంచి రెండు వేల వరకు పెంచారు.