SKM | న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కేంద్రంలో మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది. ‘ఢిల్లీ మార్చ్’ పేరుతో రైతులు చేపట్టిన నిరసనలకు నాలుగేండ్లు అయిన సందర్భంగా వచ్చే నెల 26న దేశంలోని 500 జిల్లాల్లో ఆందోళనలు చేపడుతున్నామని తాజాగా ప్రకటించింది.
ఏఐకేఎస్ నాయకుడు హన్నన్ మొల్లా విలేకర్లతో మాట్లాడుతూ, ‘రైతులకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం నెరవేర్చలేదు. రైతులను మోసం చేసింది. దీంతో మేం దేశమంతా ఆందోళనకు సిద్ధమవుతున్నాం’ అని అన్నారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఏడాది రైతులు తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తారని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్పాల్ అన్నారు.