Ketan Agarwal : మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగా సియా గోయల్‌ను పోలీసులు ఆదివారం ఉదయం 6.30 గంటలకు లోహగఢ్ కోటకు తీసుకువచ్చారు. పర్వతంపైనున్న ఈ కోట నుంచే కేతన్‌ను సియా తోసేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు పోలీసులు కోట వద్ద సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు.
సియాను తీసుకెళ్లి అక్కడ ఆమె ఎలా హత్య చేసిందో వివరంగా తెలుసుకున్నారు. ఈ సీన్ రీక్రియేషన్‌లో భాగంగా మనిషిని పోలిన ఒక బొమ్మను కూడా పోలీసులు పర్వతంపైనుంచి తోసేశారు. ఇక, పోలీసు కస్టడీలో విచారణలో సియా, చేతన్‌లు కీలక విషయాల్ని తెలిపారు. కేతన్ హత్యకు ముందు లోహగఢ్ కోటలో మర్డర్ రిహార్సల్స్ కూడా చేసినట్లు తేలింది. హత్య చేయడానికి కొద్ది రోజుల ముందు ఇద్దరూ కోటకు వెళ్లి ఏ ప్రదేశం నుంచి తోసేస్తే ఈజీగా చంపవచ్చు అనేది పరిశీలించారు. అనేక ప్రదేశాల్ని పరిశీలించి, అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. అతడిని తోసేసిన తర్వాత అది హత్యలా కాకుండా ప్రమాదంగా అనిపించేలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ముందే ప్లాన్ చేశారు. అలాగే, కేతన్ హత్య అనంతరం పోలీసులు విచారణలో అడగబోయే ప్రశ్నలు ఏంటి.. వాటికి ఏం సమాధానం చెప్పాలో కూడా ముందుగానే సిద్ధమయ్యారు.
అలాగే, హత్య చేసే విధానాల గురించి గూగుల్‌లో, యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. సియా, చేతన్ కలిసి చాలా పకడ్బందీగా హత్యకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా పోలీసులకు చిక్కకుండా, అది హత్య అనిపించకుండా, ప్రమాదవశాత్తు జరిగినట్లు ఉండేలా మర్డర్ ప్లాన్ చేశారు. ఒకవేళ కేతన్కు విషం పెడితే ఎలా దొరకకుండా ఉండొచ్చో కూడా గూగుల్‌లో వెతికారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కేతన్‌ను హత్య చేసినప్పటికీ సియా, చేతన్ చివరకు పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు సియా, చేతన్ల డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను కూడా పరిశీలిస్తున్నారు.