నాదియా/వడోదర: అత్యంత వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మూడు ఈ-రిక్షాలను ఢీ కొట్టడంతో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సహా ఆరుగురు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు.పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా, చాప్రా ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గుజరాత్‌లోని వడోదరలో గురు-శుక్రవారాల మధ్య రాత్రి 12.30 గంటలకు ఓ కారు వేగంగా దూసుకెళ్లి, రోడ్డు పక్కన ఉన్న బైక్‌లు, పాదచారులను ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళ్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ కారును నడిపిన న్యాయశాస్త్ర విద్యార్థి రక్షిత్ చౌరాసియా(20)ని స్థానికులు పట్టుకుని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
ఈ కారు యజమాని మీత్ కూడా అదే కారులో ఉన్నాడు. వీరిద్దరూ స్నేహితులని తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన వెంటనే రక్షిత్ కిందకు దిగి ‘మరో రౌండ్.. మరో రౌండ్.. ఓం నమః శివాయ’ అంటూ అరిచాడని స్థానికులు తెలిపారు. రక్షిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రక్షిత్ మద్యం సేవించాడా? లేదా? అనేది పరీక్షల తర్వాత తెలుస్తుందని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.