బెంగళూరు, అక్టోబర్ 15: కర్ణాటక వాల్మీకి స్కామ్‌కు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. గిరిజనుల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన నిధులను అప్పటి కర్ణాటక గిరిజన శాఖ మంత్రి బీ నాగేంద్ర, అతడి అనుచరులు పక్కదారి పట్టించారని ఈడీ పేర్కొన్నది. ఈ నిధులతో లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి కాంగ్రెస్ అభ్యర్థి ఈ తుకారామ్ కోసం ఓట్లను కొనుగోలు చేశారని ఆరోపించింది.
బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో 7 లక్షలకు పైగా ఓటర్లకు రూ.200 చొప్పున పంచినట్టు తెలిపింది. ఇందుకు రూ.14 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది.కాంగ్రెస్ కార్యకర్తల ఖర్చుల కోసం మరో రూ.72 లక్షలు ఖర్చు పెట్టారని పేర్కొన్నది. బళ్లారి లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి(బళ్లారి సిటీ), గణేష్(కంప్లి), ఎన్టీ శ్రీనివాస్(కుడ్లిగి)తో కలిసి నాగేంద్ర ఈ డబ్బులను పంపిణీ చేసినట్టు పేర్కొన్నది.
సొంత ఖర్చులకూ వాడుకున్నారు
వాల్మీకి నిధులను మాజీ మంత్రి బీ నాగేంద్ర తన సొంతానికి కూడా వాడుకున్నట్టు వెల్లడించింది. తనకు, తన అనుచరులకు విమాన టికెట్లు కొనేందుకు, విద్యుత్తు బిల్లులు కట్టేందుకు, వాహనాల నిర్వహణ, ఇంట్లో పని చేసే వారికి జీతాలు ఇచ్చేందుకు కూడా నాగేంద్ర ఈ నిధులను వినియోగించినట్టు వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ డెవెలప్మెంట్ కార్పొరేషన్(కేఎంవీఎస్టీడీసీ) నుంచి మార్చి – మే మధ్య కాలంలో 187.33 కోట్లు దారి మళ్లాయనే ఆరోపణలతో సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో బీ నాగేంద్రదే కీలక పాత్ర అని గుర్తించిన ఈడీ ఆయనను ఏ1గా పేర్కొన్నది.
సిద్ధరామయ్య ప్రభుత్నాన్ని బర్తరఫ్ చేయాలి: బీజేపీ
అవినీతికి, హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్టు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర చెప్పారు. ఈ నెల 25న హుబ్బళ్లిలో తమ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపడతామని చెప్పారు.