తన ప్రేమకు అడ్డుచెప్పాడనే కసితో సొంత తమ్ముడినే హతమార్చిందో అక్క. ప్రియుడితో కలిసి తమ్ముడిని కిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో పడేసింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని రామగఢ్‌లో వెలుగు చూసింది. చంచల కుమారి (25) అనే యువతి సోనూ అన్సారీ అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది.
పట్రాటు థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో ఒంటరిగా ఆమె నివాసం ఉంటుండగా.. సోనూ అక్కడకు తరచూ వస్తుండేవాడు. ఇది ఆమె సోదరుడు రోహిత్ కుమార్ (21) కంట పడింది. అక్క చేస్తున్న పనిని తప్పుపట్టిన రోహిత్.. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తానన్నాడు. దాంతో అదనుచూసి సోనూతో కలిసి రోహిత్‌ను హతమార్చిందా అక్క. అనంతరం శవాన్ని పవర్ స్టేషన్ సమీపంలోనే పడేసింది.
కుమారుడిని చంచల కుమారి చంపేసిందని ఆ ఇద్దరి తండ్రి కేసు పెట్టాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. విచారణ సందర్భంగా రోహిత్‌ను హత్య చేయడంలో తన పాత్ర ఉందని చంచల కుమారి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.