న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ ఆప్ చీఫ్ అనూప్ కేసరి బీజేపీలో చేరిన నేపధ్యంలో ఆయనపై ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా శనివారం సంచలన ఆరోపణలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై అనూప్ కేసరిని పార్టీ నుంచి తొలగించాలని తాము భావించామని చెప్పారు. ఇలాంటి వారికి కాషాయ పార్టీయే సరైనదని వ్యాఖ్యానించారు.
కాగా, ఆప్ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనూప్ కేసరి, ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర్, ఉనా జిల్లా చీఫ్ ఇక్బాల్ సింగ్ ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకున్నారు. బీజేపీలో చేరిక సందర్భంగా ఆప్ నేతలు ఢిల్లీ సీఎం, ఆ పార్టీ అధిపతి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ఉనాకు చెందిన అనూప్ కేసరి వృత్తిరీత్యా న్యాయవాది. 2013లో ఆప్‌లో చేరిన కేసరి డిసెంబర్ 2020లో హిమాచల్ ప్రదేశ్ ఆప్ చీఫ్‌గా ఎంపికయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ అగ్రనేతలు బీజేపీలో చేరడంతో కాషాయ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు బీజేపీ నేతలు ఆప్‌లో చేరడం కాషాయ శిబిరంలో కలకలం రేపింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోరు జరగనుండగా పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో హిమాచల్‌లోనూ సత్తా చాటాలని ఆప్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.