న్యూఢిల్లీ, జూలై 11: దేశంలో కరోనా మూడోముప్పు ప్రారంభమవ్వడానికి సమయం ఆసన్నమైందా? పర్యాటక ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా నెలకొంటున్న రద్దీ మహమ్మారి వ్యాప్తికి వారధిగా మారిందా? రేట్ ఆఫ్ గ్రోత్ (ఆర్-నంబర్)లో పెరుగుదలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. మే 15వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ మధ్య ఆర్ విలువ 0.78 నుంచి 0.88కు పెరిగింది. ఫలితంగా యాక్టివ్ కేసుల తగ్గుదల నిలిచిపోతున్నదని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుడు సీతాభ్ర సిన్హా తెలిపారు. ఆర్ విలువను 1 కంటే తక్కువగా ఉండేలా చూస్తూ.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తేనే మహమ్మారికి ముకుతాడు వేయవచ్చని సూచించారు.
ఏమిటీ ఆర్ వ్యాల్యూ?
వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని రేట్ ఆఫ్ గ్రోత్ (ఆర్-నంబర్)గా పేర్కొంటారు. ఆర్ విలువ 0.88గా నమోదైందంటే 100 మంది కొవిడ్ పాజిటివ్ బాధితుల నుంచి వ్యాధి 88 మందికి సోకుతున్నట్టు అర్థం. ఆర్ విలువ 1 దాటిందంటే.. వ్యాధి వ్యాప్తిరేటు శరవేగంగా పుంజుకుంటుందని గమనించాలి. ప్రస్తుతం కేరళలో ఆర్ విలువ 1.1గా, మహారాష్ట్రలో ఆర్ విలువ 1గా నమోదవుతున్నది.
‘డెల్టా’ను సమర్థంగా అడ్డుకుంటున్న స్పుత్నిక్ వీ
మాస్కో : డెల్టా వేరియంట్‌పై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నదని తాజా అధ్యయనంలో తేలింది. రష్యా తయారుచేసిన ఈ వ్యాక్సిన్.. డెల్టా నుంచి 90 శాతం దాకా రక్షణనిస్తున్నదని నొవొసిబిర్స్ స్టేట్ యూనివర్సిటీ లెబొరేటరీ సభ్యుడు సెర్గే నెటెసొవ్ అన్నారు. యూకే, యూఎస్, ఇతర దేశాల సమాచారం ఆధారంగా స్పుత్నిక్ వీ టీకా డెల్టా వేరియంట్ నుంచి 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు తేలిందని తెలిపారు.