Siddaramaiah | కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోసారి స్పందించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను తీవ్రంగా ఖండించారు. ఐదేళ్ల పాటూ తాను ఈ పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘సీఎం మార్పు’పై స్పష్టతనిచ్చారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను. రాజీనామా చేయమని కాంగ్రెస్ హైకమాండ్ నన్ను ఆదేశించలేదు. నేను సీఎంగా దిగిపోయి డీకే శివకుమార్‌కు దారి ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ కోరిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ విషయంపై నేను ఇప్పటికే స్పష్టత ఇచ్చాను. జులై 2న ప్రకటన కూడా చేశాను. ఆ రోజు డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. డీకే శివకుమార్ సీఎం కావాలని ఆశపడుతున్నారు. అందులో తప్పు లేదు. ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు (Seat not empty) అని ఆయనే అన్నారుగా’ అంటూ చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి (Karnataka CM) పీఠంపై డీకే శివకుమార్ (DK Shivakumar), సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘రెండున్నర సంవత్సరాలు అంటూ ఎప్పుడూ నిర్ణయించలేదు. అది సరైంది కూడా కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉండాలని హైకమాండ్ చెప్పింది. మాది హైకమాండ్ పార్టీ అని మల్లికార్జున ఖర్గే కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. వారు ఏం చెప్పినా మేం దాన్ని అనుసరించాలి. నేనూ అదే చేస్తున్నా. డీకే శివకుమార్ కూడా దాన్నే అనుసరిస్తారు’ అంటూ సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పుపై ప్రతిష్టంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే సీఎం మార్పును కోరుకుంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు డీకే శివకుమార్‌కే (DK Shivakumar) ఉందంటూ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి చెబుతుండటంతో కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
Also Read..
Shubhanshu Shukla | అంతరిక్షంలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మెంతి, పెసర విత్తనాలు పెంచుతూ..
Earthquake | ఢిల్లీలో స్వల్ప భూకంపం.. హర్యానా, రాజస్థాన్, యూపీలోని ప్రకంపనలు