బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌తో (Bengaluru Roads) వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండంతో కంపెనీలు తరలివెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో నగరమంతా దుమ్ముతో నిండిపోతున్నదని, రానున్న ఐదేండ్లలో కూడా ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కన్పించకపోవడంతో తాను కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించుకున్నట్టు బ్లాక్‌బక్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. నగరంలో గుంతల రోడ్లను వెంటనే సరిచేయాలని అధికారులకు సీఎం సిద్దరామయ్య (CM Siddaramaia) ఆదేశాలు జారీచేశారు. నెల రోజుల్లోపు నగరంలోని అన్ని రోడ్లను సరిచేయాలని, ట్రాఫిక్ సమస్యను తీర్చాలని డెడ్‌లైన్ విధించారు. లేనట్లయితే సంబంధిత కాంట్రాక్టర్లు, వార్డు ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్, మున్సిపల్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యతతో, శాస్త్రీయ పద్ధతుల్లో రోడ్లు పూర్తిచేయాలని, ఎక్కడా రాజీపడొద్దని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. నగరంలో గుంతల రోడ్లతో ప్రజలు ఎందుకు బాధలు ఎదుర్కోవాలని అధికారులను ప్రశ్నించారు. రోడ్లు బాగుచేయడానికి వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు బాగుచేయడానికి వానాకాలం ముగిసే వరకు ఎదురుచూడాలా అని మండిపడ్డారు.
స్టార్టప్‌ల హబ్‌గా పేరొందిన బెంగళూరు ప్రతిష్ట అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌తో మసక బారుతోంది. ఈ పరిస్థితులకు విసిగివేసారిన బ్లాక్‌బక్ అనే లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ నగరంలోని ఔటర్‌రింగ్ రోడ్ ప్రాంతం నుంచి తన కార్యాలయాన్ని తరలిస్తున్నది. ఘోరమైన గోతులతో నిండిన రోడ్లు, గంటల తరబడి ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లు, ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పట్టడం తమ కార్యాలయ తరలింపునకు ప్రధాన కారణాలని నిర్వాహకులు ప్రకటించారు. పలు టెక్నాలజీ సంస్థలకు, స్టార్టప్‌లకు కేంద్రంగా ఉన్న బెల్లందూర్‌లోని ఓఆర్ఆర్ రోడ్ ప్రాంతంలో తన కార్యాలయాన్ని తొమ్మిదేండ్ల క్రితం ఏర్పాటు చేసినట్టు సంస్థ సీఈవో రాజేశ్ యబాజీ తెలిపారు.
అయితే నగరంలో రోజురోజుకు మౌలిక సదుపాయాలు దిగజారుతున్నాయని, రోడ్లన్నీ అడుగు లోతుకు పైగా గోతులతో నిండి ఉన్నాయని, తమ ఉద్యోగులు కార్యాలయానికి రావడానికి గంటన్నరకు పైగా సమయం పడుతున్నదని చెప్పారు. నగరమంతా దుమ్ముతో నిండిపోతున్నదని, రానున్న ఐదేండ్లలో కూడా ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కన్పించకపోవడంతో తాను కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. బ్లాక్‌బక్ ప్రకటనతో కాంగ్రెస్ సర్కారుపై పారిశ్రామిక వేత్తలు ధ్వజమెత్తారు. ఇది పాలనా వైఫల్యమేనని కిరణ్మజుందార్ షా, మోహన్‌దాస్ పాయ్ తదితరులు మండిపడ్డారు.
కాగా, ఎవరైనా సరే ప్రభుత్వాన్ని బెదిరించ లేరు.. బ్లాక్మెయిల్ చేయలేరని, అది ఎంతమాత్రం పనిచేయదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధానిలో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయని తాము తమ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నామంటూ ఒక లాజిస్టిక్స్ స్టార్టప్ సీఈవో ప్రకటించడం సంచలనం కలిగించింది. ఈ క్రమంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మౌలిక సదుపాయాల సంబంధిత సమస్యలతో ఏ కంపెనీ కూడా ఐటీ రాజధానిని వదిలి వెళ్లకుండా తమ ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. అయితే డీకే వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.