Karnataka | కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. అధికార మార్పిడిపై ఉధృతంగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్ఠానం ముగింపు పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే కర్ణాటకలో రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
సీఎం మార్పు అంశం నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చలు జరపనున్నట్లు తెలిసింది. ఇవాళ లేదా రేపు వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ చర్చ తర్వాత సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. వీరిద్దరినీ నవంబర్ 28 లేదా 29న ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు సీఎం మార్పుపై సిద్ధరామయ్య, డీకే చేసిన ప్రకటనలపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సదరు వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తొందరగా ముగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య పోరు కొనసాగుతుండగా ఉప ముఖ్యమంత్రికి పదోన్నతి కల్పించాలని కోరేందుకు ఆయన మద్దతుదారులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. కాగా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని సిద్ధరామయ్య సోమవారం వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన కొందరు ఎమ్మెల్యేలకు అదనంగా డీకే శిబిరానికి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీ చేరుకోగా మరికొందరు కూడా హస్తిన బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా నాయకత్వ మార్పుపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని తనతోపాటు డిప్యూటీ సీఎం కూడా అంగీకరించక తప్పదని సిద్ధరామయ్య విలేకరులకు చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.
నవంబర్ 20వ తేదీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర ప్రకటించడం కలకలం రేపుతోంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాటలు తనకు వేద వాక్యం లాంటివని శివకుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు గురించి జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తే తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని, అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను, డీకే శివకుమార్ కట్టుబడి ఉండాల్సి ఉంటుందని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై సోమవారం విలేకరులు ప్రశ్నించినపుడు తాను కూడా ముఖ్యమంత్రి ప్రకటనతో ఏకీభవిస్తున్నానని డీకే చెప్పారు.
Also Read..
Smriti Mandhana | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన స్మృతి మంధాన తండ్రి.. పెళ్లి డేట్ ప్రకటిస్తారా..?
Mumbai Terror Attack | ముంబై మారణహోమానికి 17 ఏండ్లు
Nirmala Gavit | మాజీ ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లిన కారు