న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS)లో 18 రోజులపాటు గడిపి భూమికి సురక్షితంగా చేరుకున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఆనందంతో హత్తుకున్నారు. రెండు నెలల తర్వాత తన కుటుంబాన్ని కలవడంతో ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. యాక్సియం-4 మిషన్‌లో (Axiom-4 Mission) భాగంగా శుక్లా బృందం ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే. శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములతో ఐఎస్ఎస్ నుంచి బయల్దేరిన ‘డ్రాగన్ గ్రేస్’ వ్యోమనౌక మంగళవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) కాలిఫోర్నియా శాన్‌డియాగో తీరం వెంబడి పసిఫిక్ సముద్ర జలాల్లో సురక్షితంగా స్ప్లాష్‌డౌన్ అయింది. అనంతరం వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. వారం రోజుల పాటు నలుగురు వ్యోమగాములు పునరావాస శిబిరంలోనే గడపనున్నారు. ఈ క్రమంలో శుభాన్షును.. ఆయన సతీమణి కామ్నా, నాలుగేండ్ల కుమారుడు కైశ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంతరిక్షయానం అద్భుతం, కుటుంబ సభ్యులను చాలా రోజుల తర్వాత కలుసుకోవడం కూడా అంతే అద్భుతమని శుభాంశు శుక్లా అన్నారు. ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్లో గడిపాను. ఈ సమయంలో దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తున్నదని చెప్పారు. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం, మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటామని తెలిపారు. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వారిని కలిశానని వెల్లడించారు. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయని, అయితే మనుషుల వల్లే అవి అలా మారాయని శుభాంశు పోస్టు చేశారు.
శుభాంశు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నరని కమ్నా అన్నారు. ఈ అద్భుత ప్రయాణం తర్వాత తను తిరిగి మమ్మల్ని కలవడమే మాకు అతిపెద్ద సెలబ్రేషన్ అని తెలిపారు. ఇకపై తను మునుపటి జీవితాన్ని కొనసాగించడంపైనే తాము దృష్టి నిలుపుతామని చెప్పారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి భోజనం మిస్ అయ్యారని, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాని వెల్లడించారు.