బెంగళూరు, నవంబర్ 21: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. అయితే ఈసారి భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా నుంచి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు వెలువడడం విశేషం. గురువారం ఐటీ సీటీలో ఓ టెక్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ శుక్లా నగర ట్రాఫిక్ సమస్యలపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ సదస్సులో ప్రసంగించడానికి తాను వెచ్చించాల్సిన సమయానికి మూడు రెట్ల సమయాన్ని ట్రాఫిక్‌లో గడిపానని ఆయన చెప్పుకొచ్చారు.
బెంగళూరుకు అవతల పక్కన ఉన్న మారతహళ్లి నుంచి ఇక్కడకు వస్తున్నాను. మీముందు ప్రసంగించేందుకు వెచ్చించే సమయానికి మూడు రెట్ల సమయాన్ని ట్రాఫిక్‌లో గడిపాను. దీన్ని బట్టి నా పట్టుదలను అర్థం చేసుకోండి అని శుక్లా చమత్కరించారు. బెంగళూరులోని మారతహళ్లి నుంచి తుమకూరు రోడ్డుకు వెళ్లే సమయం కన్నా వేగంగా రోదసిని చేరుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, శుక్లా వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే బెంగళూరు రహదారులపై వ్యాపార ప్రముఖులు కొందరు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
కిరణ్ మజుందార్, మోహన్‌దాస్ పాయ్ వంటి ఐటీ దిగ్గజాలు చేసిన విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించడంతో అది మాటల యుద్ధానికి దారితీసింది. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పారిశ్రామిక ప్రముఖులతో సమావేశం నిర్వహించి బెంగళూరు రోడ్ల అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంది.