న్యూఢిల్లీ, జూలై 15: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 18 రోజులపాటు గడిపిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకున్నారు. శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములతో ఐఎస్ఎస్ నుంచి బయల్దేరిన ‘డ్రాగన్ గ్రేస్’ వ్యోమనౌక మంగళవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) కాలిఫోర్నియా శాన్‌డియాగో తీరం వెంబడి పసిఫిక్ సముద్ర జలాల్లో సురక్షితంగా స్ప్లాష్‌డౌన్ అయింది. దీనిని ప్రత్యక్షంగా వీక్షించిన శుభాన్షు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుక్లా బృందం ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌కు శుక్లా చీఫ్ పైలట్‌గా వ్యవహరించారు. ఐఎస్ఎస్లో ఆయన 60కిపైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు.
అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభాన్షు శుక్లాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక స్వాగతం’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ కూడా ఆయనను అభినందించారు.